నేను ఓవరాక్షన్ చేయలేదు: రష్మిక

ఛలో` వంటి హిట్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ రష్మికా మందన్న `గీతగోవిందం` సినిమాతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకుంది. మహేష్ సరసన రష్మిక నటించిన `సరిలేరు నీకెవ్వరు` ఇటీవల సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాలో రష్మిక `నీకు అర్థమవుతోందా..` అంటూ చేసిన సందడి అంతా ఇంతా కాదు.కొంతమంది రష్మిక నటనను ఇష్టపడితే మరికొందరు మాత్రం సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు. రష్మిక ఓవరాక్షన్ చేసిందని ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది. `నేను `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో అతి చేశానని కొందరు విమర్శించారు. కానీ, నేను నాకిచ్చిన పాత్రకు న్యాయం చేశానంతే. ఆ పాత్రని దర్శకుడు అలాగే డిజైన్ చేశారు. దర్శకుడు కోరినట్టు నేను నటించాల్సిందే. నిజానికి ఆ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. అలాగే నా నటనపై వచ్చిన విమర్శలను కూడా స్వీకరిస్తాను. నా తప్పులను సరిదిద్దుకుంటాన`ని రష్మిక చెప్పింది.