‘నమస్తే ట్రంప్’ స్టేడియంలో కూలిన గేట్లు..
ప్రతిష్టాత్మక 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి కొద్ది గంటల ముందు మోతేరా స్టేడియం వద్ద అపశృతి చోటుచేసుకుంది. అహ్మదాబాద్ సిటీకి కొద్దిదూరంలో ఉన్న ఈ స్టేడియంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సుమారు లక్ష మందిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆదివారం అహ్మదాబాద్ లో వాతావరణం ఒక్కసారే మారిపోయి, బలమైన గాలులు వీయడంతో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఇక్కడ బాహుబలి పాటలతో ట్రంప్ కు స్వాగతం పలకనున్నారు.
'నమస్తే ట్రంప్' ప్రోగ్రామ్ కోసం ట్రంప్, మోదీలు నేరుగా స్టేడియంలోకి ప్రవేశించే ఏర్పాట్లు చేసిన అధికారులు.. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా మరో ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం ఆ ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో ప్రధాన స్టేడియం దగ్గరున్న ద్వారంతోపాటు కొంచెం దూరంలో ఏర్పాటుచేసిన స్వాగత తోరణం కూడా కూలిపోయింది. రెండు ఘటనల్లోనూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.