మే 3 వరకు లాక్‌డౌన్‌ : మోదీ


న్యూఢిల్లీ : మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 20వరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలన చేస్తామని చెప్పారు. కరోనా హాట్‌స్పాట్‌లు కానీ ప్రాంతాలతో షరతులతో కూడిన సడలింపు ఉంటుందన్నారు. కరోనా కేసులు తగ్గితేనే సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు. హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్‌ రేపు విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ను బాధ్యతగా పాటించాలని కోరారు. కరోనాపై పోరాటంలో భారత్‌ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నేటితో తొలిదశ లాక్‌డౌన్‌ గడువు పూర్తయింది. ప్రజలు సైనికుల్లా వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉంది. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారు. మీకు దేశం వందనం చేస్తుంది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.  కరోనాపై పోరులో మన రాజ్యాంగంలోని ప్రబలమైన సామూహిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాం. వాస్తవానికి దేశంలో ఇప్పుడు పండుగలు ఎక్కువగా జరుగుతాయి. అనేక రాష్ట్రాలల్లో పండగలతో కొత్త ఏడాది ప్రారంభమైంది. పండగలు ఉన్నా ప్రజలు ఇళ్లలోనే ఉంటూ తమను తాము నియంత్రించుకుంటున్నారు. మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేడు దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఓ పోరాటం జరుగుతుంది. చాలా దేశాల కంటే ముందే భారత్‌లో ఏయిర్‌పోర్ట్‌లలో విదేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్‌ చేయడం ప్రారంభించాం.దేశంలో ఒక్క కేసు నమోదు కాక ముందే కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం.