జగన్ గారు వాళ్లను ఆదుకోండి.. టీడీపీ ఎంపీ రిక్వెస్ట్


ఏపీలో లాక్‌డౌన్ కొనసాగుతోంది.. జనాలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతండటంతో.. లాక్‌డౌన్ నిబంధనల్ని మరింత కఠినం చేశారు అధికారులు, పోలీసులు. కూలీలు, చేతివృత్తులతో ఉపాధి పొందేవారు కష్టాలు పడుతున్నారు. గత పది రోజులుగా పనులు లేకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామనే ఆవేదన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌ దెబ్బకు ఉపాధి కోల్పోతున్నామంటున్నారు కల్లుగీత కార్మికులు. తమ సమస్యల్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.
 

ఈ లేఖను ప్రస్తావిస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో స్పందించారు. కష్టాల్లో ఉన్న కల్లుగీత కార్మికుల్ని ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు వెంటనే కల్లు గీత కార్మికులను ఆదుకోండి వారు ఆకలితో అలమటిస్తున్నారు అన్నారు కేశినేని నాని. ఏపీ సీఎంవో, పీఎంవో, నరేంద్ర మోదీ, కృష్ణాజిల్లా కలెక్టర్‌ను ట్యాగ్ చేశారు. అలాగే కల్లుగీత కార్మికులు రాసిన లేఖను కూడా కేశినేని నాని ట్వీట్ చేశారు.





 






కరోనా, లాక్‌డౌన్ వేళ కేశినేని నాని ట్విట్టర్‌లో యాక్టివ్ అయ్యారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్లు, వలస కూలీల కష్టాలను ఆ రాష్ట్రాల మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యల్ని పరిష్కరించడంలో తనవంతు పాత్ర పోషించారు.