నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి డాక్టర్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌

నర్సీపట్నం : విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎనస్థీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కె.సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు. కరోనా వైరస్‌ బారినపడిన, అనుమానిత లక్షణాలు వున్న వారికి రేయింబవళ్లు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి సరిపడా పరికరాలను అందించడం లేదని, వారి ఇబ్బందులను ప్రభుత్వంపట్టించుకోవడం లేదని రెండు రోజుల క్రితం డాక్టర్‌ సుధాకర్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్‌ సుధాకర్‌ చేసిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్‌ వినయచంద్‌ నియమించిన ముగ్గురు అధికారుల (కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌, డీఆర్‌డీఏ పీడీ, నర్సీపట్నం ఆర్డీవో) బృందం మంగళవారం ప్రాంతీయ ఆసుపత్రిలో విచారణ నిర్వహించింది.నివేదికను కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపగా...డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారని ప్రాంతీయ ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణి తెలిపారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులను డాక్టర్‌ సుధాకర్‌కు అందజేశామని ఆమె తెలిపారు. శాఖాపరంగా సుధాకర్‌ను సస్పెండ్‌ చేసినప్పటికీ ఆయనపై పోలీస్‌ కేసులు నమోదుకావడంతో తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు